: పళనిస్వామికి మరో షాక్... క్యాంపు నుంచి మరో ఎమ్మెల్యే జంప్!
సొంత పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిగా వ్యతిరేకిస్తుండటం పళనిస్వామికి మింగుడు పడటం లేదు. కాసేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఆయన ఎదుర్కోబోతున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సమయంలో, పళనిస్వామికి మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆయన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే అరుణ్ కుమార్ జంప్ అయ్యారు. పళనిస్వామికి అనుకూలంగా తాను ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయబోనని ఆయన బహిరంగంగా ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆయన చేయి కలిపారు. అరుణ్ కుమార్ పన్నీర్ శిబిరంలో చేరడంతో, పళనిస్వామి బలం 122కు పడిపోయింది. బల పరీక్షలో ఆయన నెగ్గాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అరుణ్ కుమార్ జంప్ కావడంతో, పళనిస్వామి శిబిరం కలవరపడుతోంది. ఓటింగ్ సమయానికి ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు తమను వ్యతిరేకిస్తారో అనే భయం వారిని ఆవరించుకుంది.