: ఆ విశిష్ట అతిథి కోరికను సాకారం చేస్తానన్న చంద్రబాబు!
విజయవాడలో ఐ.టి.కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు ఓ విశిష్ట అతిథి కనపడ్డారు. వెంటనే, ఆయన్ని ఆప్యాయంగా చంద్రబాబు పలకరించారు. ఇంతకీ, ఆ విశిష్ట అతిథి ఎవరంటే.. ఆధ్యాత్మికవేత్త కృష్ణ దీక్షిత్ జీయర్. ఆయన పూర్వాశ్రమం గురించి చెప్పాలంటే.. అణుసాంకేతిక పరిజ్ఞానంలో పీహెచ్ డి చేసిన కృష్ణ దీక్షిత్, దేశ విదేశాల్లోని పలు కంపెనీల్లో పని చేశారు. ఆ తర్వాతి కాలంలో జీయర్ స్వామి వద్ద శిష్యరికం చేసి కృష్ణ దీక్షిత్ జీయర్ గా మారారు.
తన విజ్ఞానాన్ని పదిమందికి పంచడంతో పాటు, ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్న ఆయన్ని ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్న కృష్ణ దీక్షిత్ జీయర్ ను ప్రశంసించిన చంద్రబాబు, ఆయన కోరిక మేరకు కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.