: శశికళను తొలగించే అధికారం ఆయనకు లేదులేండి!: సెంగొట్టియాన్
తమిళనాడు సీఎం పళనిస్వామి రేపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గంలో ఉన్న అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్.. ప్రస్తుతం జైల్లో ఉన్న శశికళతో పాటు దినకరన్, వెంకటేశ్, సీఎం పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన అంశంపై మంత్రి సెంగొట్టియాన్ స్పందించారు. తమ పార్టీ నియమ నిబంధనల ప్రకారం అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ అయిన శశికళను సస్పెండ్ చేసే అధికారం మధుసూదనన్‌కు లేదని ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. రేపు అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షలో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.