: వ్యూహం మార్చిన పళనిస్వామి... శశికళతో నేటి భేటీ రద్దు
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు పెంచడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యూహం మార్చారు. నిన్న రాత్రి జయలలిత సమాధిని సందర్శించిన పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, కార్యకర్తలే ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచాలని, రిసార్టులో విశ్రాంతిలో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు రప్పించాలని పిలుపునిచ్చారు. దీనికి తగ్గట్టే సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
ఈ పరిణామాలను గమనించిన పళనిస్వామి హుటాహుటీన గోల్డెన్ బే రిసార్టుకు బయల్దేరారు. అన్నాడీఎంకే తాత్కాలిక సెక్రటరీ శశికళతో ములాఖత్ ను రద్దు చేసుకున్నారు. రేపే బలనిరూపణలో పాల్గొని, ఆ తరువాత అటునుంచి పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లి శశికళతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. రేపు బలనిరూపణ వరకు ఎమ్మెల్యేలు రిసార్ట్ దాటకుండా మన్నార్ గుడి మాఫియా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.