: తమిళనాట ఆసక్తి పెంచుతున్న వ్యూహాలు... ఎవరి లెక్కలు వారివే!


తమిళనాడులో వ్యూహప్రతివ్యూహాలు పదునెక్కుతున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు మావైపే అంటూ ముఖ్యమంత్రి పీఠమెక్కిన   పళనిస్వామి తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచి బెంగళూరు బయల్దేరనుండగా, ప్రభుత్వాన్ని కూల్చడమే తన లక్ష్యమంటూ పన్నీర్ సెల్వం దివంగత నేత జయలలిత సమాధి సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఈ రెండు వర్గాలు ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నాయంటూ ఆసక్తి రేగుతోంది.

మరోపక్క ఇప్పటికే రిసార్టులోని కొంత మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు బయల్దేరారు. నియోజకవర్గాల్లో ప్రవేశించగానే వారికి అసలు పరీక్ష ఎదురైంది. పార్టీ కార్యకర్తలు వారి వాహనాలను అడ్డుకున్నారు. వారి కార్లపై మట్టి (శాపనార్థాలు పెడుతూ) పోశారు. అనంతరం కార్లపై ఉమ్మివేశారు. ఈ పరిణామాలతో పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు బిత్తరపోయారు. దీంతో పోలీసుల సాయంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లకు చేరుకున్నారు. ఇవన్నీ గమనించిన పళనిస్వామి వర్గం పన్నీరు సెల్వంపై మండిపడుతున్నారు. ఇవన్నీ చేయిస్తోంది పన్నీరు సెల్వమేనని విమర్శలు గుప్పించారు.

మరోవైపు మంత్రి సీవీ షణ్ముఖం నివాసం ఉన్న గ్రీన్ వేస్ రోడ్డులో సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతంలో ఉన్న పన్నీరు సెల్వం వర్గీయులపై దాడికి దిగారు. దీంతో ఎదురు తిరిగిన పన్నీరు సెల్వం వర్గీయులు మంత్రి నివాసంపైకి రాళ్లు రువ్వారు. ప్రతిగా మంత్రి అనుచరులు కూడా రాళ్ల దాడి చేశారు. ఇందులో పన్నీరు సెల్వం వర్గీయులు గాయపడ్డారు.

కాగా, తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం 134 మంది శాసనసభ్యులు. వీరిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 20 మంది, గౌండర్ సామాజికవర్గానికి చెందినవారు 28 మంది, వన్నియర్ సామాజికవర్గానికి చెందినవారు 19 మంది, దళిత సామాజిక వర్గానికి చెందినవారు 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

గతంలో జయలలిత, పన్నీరు సెల్వం మంత్రివర్గాల్లో 12 మంది దేవర్ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రులుగా పని చేసేవారు. పళనిస్వామి మంత్రి వర్గంలో కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య 11. వీరంతా తొలుత పన్నీరు సెల్వంకు అండగా నిలబడతారని భావించారు. శశికళ సామాజిక వర్గం కూడా అదే కావడంతో అందరూ ఊహించిన దానికి భిన్నంగా, శశికళకే వారు జై కొట్టారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఎలాంటి వ్యూహంతో ప్రభుత్వాన్ని పడగొడతాడో చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News