: పాకిస్థాన్ మసీదులో బాంబు దాడి ఘటన: 100కు పెరిగిన మృతుల సంఖ్య


పాకిస్థాన్‌ లోని సింధ్‌ ప్రావిన్స్‌ సెహ్వాన్‌ లో ఉన్న సుప్రసిద్ధ లాల్‌ షాబాజ్‌ కలందర్‌ దర్గాలో జరిగిన బాంబు దాడిలో 100 మందికిపైగా మరణించగా, 250 మందికి పైగా భక్తులు తీవ్రగాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దర్గాలో ప్రతి గురువారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ధమాల్‌ (సూఫీ నృత్య వేడుక) నిర్వహిస్తారు. సరిగ్గా ధమాల్ సందడిలో ఉన్న భక్తులు ఆనందపరవశులై ఉండగా, మందిర ప్రధాన ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తొలుత ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌ ను సూఫీ భక్తులపైకి విసిరాడు. అయితే అది పేలలేదు. దీంతో మరింత ఆగ్రహంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. అప్పటివరకు నృత్యాలతో సంతోషంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసిన రక్తమోడుతూ రక్షించాలన్న ఆర్తనాదాలు వినిపించాయి. శరీర భాగాలు ఖండఖండాలుగా ఎగిరిపడ్డాయి.

భారీ శబ్దంతో దర్గాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, స్థానికులు సహాయకచర్యలు చేపట్టారు. తొలుత వారు కూడా అక్కడి భీతావహ దృశ్యాలు చూసి బెంబేలెత్తిపోయారు. అయితే అక్కడి బాధితుల పరిస్థితి, ఆర్తనాదాలు విని చలించిపోయి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం మృతుల్లో 12 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు.  

ఇక్కడికి 40-50 కిలోమీటర్ల వరకు ఒక్క ఆసుపత్రి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యల కోసం సాయుధ దళాలను, సైన్యానికి చెందిన సి-130 విమానాన్ని, నేవీ హెలికాప్టర్‌ ను రంగంలోకి దించినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. ఘటనాస్థలిలో అత్యవసర చికిత్సలందించేందుకు జమ్‌ షోరో, నవాబ్‌ షా, హైదరాబాద్‌ ల నుంచి వైద్యులను రంగంలోకి దించినట్టు కూడా ఆయన వెల్లడించారు. కాగా, ఈ బాంబుదాడి చేసింది తమ సైనికుడేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. దీంతో సింధ్ ప్రావిన్స్‌లోని అన్ని ప్రార్థనా మందిరాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

  • Loading...

More Telugu News