: హఫీజ్ సయీద్ మంచి సేవాతత్పరుడు.. విడిచిపెట్టండి!: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్
పాకిస్థాన్ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషిస్తానని ఇటీవలే సంకేతాలు ఇచ్చిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ముంబై పేలుళ్ల కుట్రదారు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌ను మంచివాడంటూ స్తుతించారు. ఆయనను ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఆయనను విడుదల చేయాలని సైతం ముషారఫ్ వ్యాఖ్యలు చేశారు.
హఫీజ్ ఉగ్రవాది కాదని, ఓ మంచి ఎన్జీవోను నడిపిస్తున్నారని అన్నారు. హఫీద్ సయీద్ పాకిస్థాన్‌లో సేవా కార్యక్రమాలను నిర్వహించాడని, దేశంలో భూకంపాలు, వరదల సమయంలో సహాయక కార్యక్రమాలు చేపట్టాడని ప్రశంసించారు. హఫీజ్ పాక్ సహా ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని ముషారఫ్ కితాబునిచ్చారు. ప్రస్తుతం హఫీజ్ సహా ఆయన అనుచరులను 90 రోజుల పాటు పాకిస్థాన్ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది.