: శశికళ ఉదంతంతోనైనా జగన్ తీరు మార్చుకోవడం లేదు: ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు గుంటూరులో యువభేరి నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తమిళనాడులో శశికళ నటరాజన్ ఉదంతంతోనైనా జగన్ తీరు మార్చుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఏడాది తర్వాత జగన్ అధికారంలోకి వస్తానని చెప్పుకుంటున్నారని, ఆయన అధికారంలోకి రారని, జగన్ ఎక్కడకు వెళ్తారో ప్రజలకు బాగా తెలుసని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాష్ట్రంలోని విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, మరోవైపు ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్నారని ప్రత్తిపాటి ఆరోపించారు. జూన్ తరువాత తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ అంటున్నారని, అప్పటివరకు ఎందుకని, దమ్ముంటే రేపే రాజీనామా చేయండి అని ఆయన అన్నారు.