: నన్ను రేప్ చేసిన వాడితోనే కలిసి ఉండాలనుంది.. బిడ్డను కంటాను!: కోర్టుకు తెలిపిన బాధితురాలు


తనను రేప్ చేసిన వ్యక్తితోనే కలిసి జీవించాలని ఉందని పేర్కొంటూ ఓ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించిన ఘటన గుజరాత్ లో ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే...గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై న్యాయ పోరాటం చేసిన సదరు యువతి విజయం సాధించింది. అతను జైలుకెళ్లాడు. ఇంతలో అతను చేసిన దారుణానికి సదరు బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో గర్భస్రావం చేయించుకునే ప్రయత్నం చేయగా, పిండం పెరిగిందని చెబుతూ ఆమెకు అబార్షన్ చేసేందుకు వైద్యులు ముందుకు రాలేదు. దీంతో తన గర్భాన్ని తీసేసేందుకు అనుమతించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 20 వారాలు దాటిపోవడంతో ఆమె గర్భవిచ్చత్తి ప్రాణగండంగా మారుతుందన్న వైద్యుల సలహాతో అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.

దీంతో దీనికి పరిష్కారంగా భాధితురాలు, నిందితుడిని ఇష్టపడుతున్నానని, బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నానని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో నిందితుడ్ని న్యాయస్ధానానికి పిలిపించి, అతని అభిప్రాయం కోరగా, ఆమె అంటే తనకు ఇష్టమని, ఆమెను, బిడ్డను బాగా చూసుకుంటానని బదులిచ్చాడు. దీంతో అత్యాచార బాధితురాలు నిందితుడి కుటుంబంతో కలసి ఉండే విధంగా చూడాలని ఆనంద్‌ జిల్లా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యువతికి సురక్షితంగా ప్రసవం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని మహిసాగర్‌ సామాజిక సంక్షేమ శాఖ అధికారికి సూచించింది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News