: లైటు ఆర్పాలని కోరిన మరో ఖైదీ... తప్పనిసరై నడుం వాల్చిన శశికళ!
బెంగళూరు పరప్పన అగ్రహారంలోని ఓ బ్యారక్ ను తన మేనకోడలు ఇళవరసి, మరో ఖైదీతో కలసి పంచుకున్న శశికళ, రాత్రి 10:30 గంటలైనా, లైట్లు ఆర్పక పోవడంతో, తాను నిద్రపోవాలని చెబుతూ, వెంటనే లైట్లు ఆర్పివేయాలని సదరు ఖైదీ కోరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శశికళ నడుం వాల్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. శశికళ గత రాత్రి సరిగ్గా నిద్రించలేదని, పలుమార్లు లేచి కూర్చున్నారని బ్యారక్ కు కాపలాగా ఉన్న సెంట్రీ ఒకరు తెలిపారు. ఇక అంతకుముందు శశికళ, జయలలిత ఇదే జైల్లో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడిన కొందరు మహిళా పోలీసులను గుర్తించిన శశికళ, వారిని పలకరించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. నేడు తెల్లవారుజామున 4:30 గంటలకే నిద్రలేచిన ఆమె, పత్రికలు ఎన్ని గంటలకు వస్తాయి? నాకు తమిళ పత్రికలు తెచ్చివ్వండి, అందుబాటులో ఉన్న అన్ని పేపర్లూ తెండి అని కోరడంతో, సిబ్బంది వాటిని తెచ్చిచ్చారు. ఆంగ్ల పత్రికలను వెంటనే ఇచ్చిన సిబ్బంది, తమిళ పత్రికలు మాత్రం ఉదయం 7 గంటల తరువాతనే వస్తాయని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.