: శశికళ లొంగిపోయిన జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత... రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయిన దుండగులు
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో సుప్రీంకోర్టు శశికళ నటరాజన్ కు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జైలులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన సమయంలో జైలు బయట ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ ఉన్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలపై పలువురు దుండగులు దాడి చేశారు. హెల్మెట్లు పెట్టుకొని అక్కడకు చేరుకున్న పలువురు దుండగులు రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. ఈ పని బెంగళూరు స్థానికులే చేశారని కొందరు అంటుండగా, ఈ పని పన్నీర్ సెల్వం అనుచరులే చేశారని శశికళ వర్గీయులు ఆరోపిస్తున్నారు. జైలు బయట ఉద్రిక్తత చెలరేగడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడిలో ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.