: ఈ ప్రయోగం రికార్డుల కోసం కాదు...ఇస్రో సామర్థ్యం ప్రపంచానికి చెప్పేందుకే!: కిరణ్ కుమార్
నిన్న ఉదయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రసాంకేతిక రంగాల నిపుణులంతా భారత్ వైపు ఆసక్తిగా చూశారు. అమెరికాకు చెందిన నాసా, రష్యాకు చెందిన రోస్ కాస్మోస్, చైనాకు చెందిన నేషనల్ స్పేస్ ఏజెన్సీలకు సాధ్యం కాని ఘనతను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించగలుగుతుందా? అన్న అనుమానం అందర్లోనూ ఉంది. భారత అంతరిక్ష పరిశోధనల ఖ్యాతిని జగద్విదితం చేస్తూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ37 104 ఉపగ్రహాలతో నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. దీనిని శాస్తవేత్తలంతా నిబిడాశ్చర్యంతో తిలకించారు. షార్ శాస్త్రవేత్తలంతా చప్పట్లు కొట్టిన తరువాత కానీ భారతీయులందరూ బిగబట్టిన ఊపిరి వదల్లేదు.
ఈ నేఫథ్యంలో ఇస్రో ఛైర్మన్ ఏఎస్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, 104 ఉపగ్రహప్రయోగం రికార్డుల కోసం చేపట్టలేదని అన్నారు. ఇస్రో సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి పూనుకున్నామని ఆయన తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఇస్రోకు అత్యంత విశ్వాసపాత్రమైన పీఎస్ఎల్వీతో ఈ ఘనతను సొంతం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒప్పందం పూర్తైందని ఆయన తెలిపారు. ఉపగ్రహాల నిర్వహణను ఆయా దేశాలే నిర్వహించుకుంటాయని ఆయన చెప్పారు. చంద్రయాన్-2 ద్వారా ల్యాండర్ ను పంపి పరిశోధనలు చేస్తామని ఆయన తెలిపారు.