: శశికళలో ఎంత కోపాగ్ని... ఆ బాడీ లాంగ్వేజ్ ని ఎలా అర్థం చేసుకోవాలి?


బెంగళూరుకు వెళ్లి కోర్టులో లొంగిపోయే ముందు మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు వచ్చిన శశికళలో కనిపించిన కోపాగ్నిని చూసిన వారంతా, సౌమ్యంగా కనిపించే శశికళలో ఇంత ఆగ్రహాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఆమె ముఖంలో రౌద్రం స్పష్టంగా కనిపించగా, పెదవులు బిగబట్టి, ఆమె సమాధిపై బలంగా కొడుతూ, శపథాలు చేసిన తీరు అక్కడున్న అన్నాడీఎంకే నేతలను ఆశ్చర్యపరిచింది. ఆమె ఏమేమి శపథాలు చేశారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ఒకటేనని, పన్నీర్ సెల్వంకు అధికారం దక్కకుండా ఉండటం, పార్టీ విడిపోకుండా తాను సూచించిన వారికి సీఎం పదవి దక్కడమేనని అర్థమవుతోంది. పోయిస్ గార్డెన్ లోని తన నివాసం నుంచి సమాధి వద్దకు చేరిన ఆమె, దిగాలు చెందిన ముఖంతో కనిపించారు. అమ్మ సమాధికి నమస్కరించారు. ఆపై శపథాలు చేశారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా చిన్నమ్మకు జయజయధ్వానాలతో మారుమోగింది. ఆ సమయంలో శశికళల బాడీ లాంగ్వేజ్ ని చూసిన వారు, పార్టీకి ఏమీ కాదన్న నమ్మకంతో ఉన్నట్టు కనిపించారని, జైలులో వున్నా తాను పార్టీని నడిపిస్తానన్న నమ్మకం ఆమె ముఖంలో కనిపించిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News