: గగనపు వీధిలో భారత మువ్వన్నెల పతాక ఎగిరే సమయం!
ఇండియాలో అత్యంత విజయవంతమైన పీఎస్ఎల్వీ రాకెట్. ప్రపంచంలో మరే దేశమూ తలపెట్టని విధంగా 104 ఉపగ్రహాలు ఒకేసారి అంతరిక్షంలోకి... భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ వేదిక నుంచి నేడు జరపనున్న ప్రయోగాన్ని ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పీఎస్ఎల్వీ సీ 37 మరికాసేపట్లో నింగికి ఎగరనుంది. ఇది విజయవంతమైతే, ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను నింగికి పంపిన దేశంగా భారత ఖ్యాతి జగద్వితమవుతుంది.
ఇందుకు సంబంధించిన కౌంట్ డౌన్ నిన్న ఉదయం 5:28కి ప్రారంభమైంది. 9:28కి రాకెట్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. ఆపై నాలుగు దశల్లో 28.42 నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. దాదాపు 714 కిలోల బరువున్న కార్టోశాట్ 2డీ ఉపగ్రహం అన్నింటికన్నా బరువైనది కాగా, ఇస్రో నానో ఉపగ్రహాలు రెండు అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. గతంలో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించగా, ఇప్పుడు దాన్ని భారత్ అధిగమించాలని ప్రయత్నిస్తోంది.