: పాపం శశికళ... ఎంతలో ఎంత మార్పు... ఇప్పుడంతా గతవైభవమే!
కాలం కలిసి వస్తే బళ్లు ఓడలు, కాలం కలిసిరాకపోతే ఓడలు బళ్లు అవుతాయన్న నానుడి తమిళనాడు అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళా నటరాజన్ పట్ల నిజమైంది. వీడియో షాపు ఓనర్ గా జీవితాన్ని సాధారణంగా నడిపిన శశికళ... వ్యక్తిగత సహాయకురాలిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోకి ప్రవేశించడంతో ఆమె జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. జయలలితకు ధనాపేక్షలేదు. సినీ జీవితం ఉచ్ఛస్థితిలో ఉండగానే ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. దీంతో ఆమెకు డబ్బుకు ఏనాడూ లోటు లేదు. శశికళకు అలా కాదు, డబ్బుకోసం తీవ్ర ప్రయత్నాలు, స్థితిమంతురాలిగా మారాలన్న కోరికతో జయలలిత వెన్నంటి ఉన్నారు. అదే సమయంలో ఆమె (జయలలిత) కు కొంత ఓదార్పు అవసరమైంది.
దీనిని అవకాశంగా మలచుకున్న శశికళ వ్యక్తిగత సహాయకురాలి స్థాయి నుంచి నమ్మకస్తురాలిగా, సన్నిహితురాలిగా, ఆప్తమిత్రురాలిగా మారారు. ఇదంతా జయలలిత గొప్పదనమే... ఆమె గత అనుభవాలు ఎవరినీ ఆమెకు దగ్గర చేయలేకపోయాయి. ప్రత్యర్థుల పన్నాగాలు పసిగట్టేందుకు శశికళకు జయలలిత పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. దీన్ని అవకాశంగా మలచుకున్న శశికళ కుటుంబం జయలలితకు దగ్గరైంది. ఏకంగా పొయెస్ గార్డెన్ కు మకాం మార్చింది. శశి మేనల్లుడ్ని జయకు దత్తపుత్రుడ్ని చేసింది. దీంతో ఇక అంతా తమదే అని భావించిన మన్నార్ గుడి మాఫియా, ఆమె అధికారాన్ని అండగా చేసుకుని అక్రమాలకు తెరతీసింది. జయలలితపై విషప్రయోగం కూడా జరుగుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిని పసిగట్టిన జయలలిత, శశిని, ఆమె కుటుంబాన్ని పొయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు.
అయితే, నాలుగు నెలల తరువాత భర్త, కుటుంబాన్ని వదిలేశానంటూ శశికళ మళ్లీ జయలలిత చెంతకు చేరారు. దీంతో ఆమెను జయలలిత అక్కున చేర్చుకున్నారు. ఇంతలో అధికారం కోల్పోవడం, అక్రమాస్తుల కేసులు చుట్టుముట్టడం, జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటికి రావడం, ఎన్నికల్లో విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జయలలితను అనారోగ్యం చుట్టుముట్టడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
అప్పటికే పోయెస్ గార్డెన్ ను, రాష్ట్ర పాలనను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న శశికళలో ఇక ముఖ్యమంత్రి కావాలన్న కాంక్ష మొదలైంది. పన్నీర్ సెల్వాన్ని ఇంటికి పిలిపించుకుని, ఆయన చేత రాజీనామా చేయించి, శాసన సభా పక్ష నాయకురాలిగా తాను ఎన్నికయ్యేలా చేసుకున్నారు. దీంతో అవమానానికి గురైన పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అదే సమయంలో జయలలితతో అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు ఈరోజు శిక్షను ఖరారు చేసింది.
దీంతో రాజకీయాధికారం ఆశలు అడియాసలయ్యాయి. ఒక్కసారిగా తనకు జైకొట్టిన కార్యకర్తలు దూరమయ్యారు. జైలు శిక్షతో ప్రభుత్వం సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. ఇక ఆమె చెరసాలకు వెళ్లడమే తరువాయి. బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు కావడమంటే ఇదే కదా మరి!