: రిసార్టుకి దూసుకెళుతున్న పన్నీర్ సెల్వం వర్గీయులను అడ్డుకున్న పోలీసులు
శశికళ నటరాజన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, వారిని బయటకు తీసుకొస్తామని, బందీలుగా ఉన్న వారిని విడిపిస్తామని నినాదాలు చేస్తూ వెళ్లిన పన్నీర్ సెల్వం వర్గీయులు మార్గమధ్యంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. వారు రిసార్టు వద్దకు వెళితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన పోలీసులు వారిని రిసార్టు సమీపంలోకి కూడా రాకుండా అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి తిరిగి వెళ్లాల్సిందిగా కోరారు. దీంతో పన్నీర్ సెల్వం వర్గీయులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గోల్డెన్ బే రిసార్టుని వేల మంది పోలీసులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. రిసార్టు వద్ద శశికళ ప్రైవేటు సిబ్బంది కూడా ఉంది. శాసనసభ పక్షనేతగా పళనిస్వామి నియామకాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పన్నీర్ సెల్వం వర్గీయులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలను తీసుకొని వెళతామని, అందరం కలిసి శాసభసభ పక్షనేతను ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు అంటున్నారు.