: రిసార్ట్స్‌లో మమ్మల్ని దారుణంగా హింసించారు: తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే శరవణన్
అన్నాడీఎంకే పార్టీలో తనకు మద్దతు తగ్గకుండా ఉండేందుకు శశికళ నటరాజన్.. తమ ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి వేషం మార్చుకొని, గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పారిపోయి పన్నీర్ సెల్వం వద్దకు వచ్చిన దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. శశికళ అనుచరులు తమను రిసార్టులో చిత్రహింసలకు గురిచేశారని ఆయన అన్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరినీ ఒంటరిని చేసి అక్కడ ఉంచారని ఆయన ఆరోపించారు.
తమ భావోద్వేగాలను సైతం పట్టించుకోకుండా తమను మానసికంగా, శారీరకంగా వేధించారని ఎమ్మెల్యే శరవణన్ చెప్పారు. మరోవైపు తాము ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా అక్కడి నుంచి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ వస్తున్నామని తెలిపారు. తమ నియోజక వర్గాల ప్రజలతో ఫోన్ ద్వారా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, తమకు రిసార్ట్‌లో మద్యం, అమ్మాయిలను సరఫరా చేశారంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని ఆయన చెప్పారు.