: పన్నీర్ ఇంటికి చేరుకునేందుకు యత్నిస్తున్న రిసార్ట్ లోని శశికళ ఎమ్మెల్యేలు!
సుప్రీంకోర్టు తీర్పుతో రిసార్ట్ లో ఉన్న శశికళ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. తీర్పు వెలువడిన వెంటనే వారు తట్టా బుట్టా సర్దుకునే ప్రయత్నంలో పడ్డారని సమాచారం. శశికళ ఇక నేరుగా జైలుకే వెళ్లనుండటంతో... ఆమె వర్గంలో నైరాశ్యం నెలకొంది. ఇక పన్నీర్ కు జై కొట్టడమే మేలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఇన్ని రోజులు తమను బలవంతంగా రిసార్టులో ఉంచారని, తాము పన్నీర్ కే మద్దతు ప్రకటిస్తామని వారు మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. శశి వర్గం నుంచి మరో వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజలు వారికి మద్దతు ప్రకటించే అవకాశం ఎంత మాత్రం లేదు. ఈ నేపథ్యంలో, తమ రాజకీయ భవిష్యత్తు రీత్యా ఆలోచించినా... పన్నీర్ చెంతకు చేరితే, ప్రజలు మద్దతును పొందవచ్చనే ఆలోచనలో శశి వర్గీయులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు రిసార్ట్ వద్దకు భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావడానికి అనుగుణంగా బలగాలు మోహరిస్తున్నాయి. అంతేకాదు, రిసార్టులోనే ఉన్న శశికళను అక్కడ నుంచి జైలుకు తరలించాలన్నా భారీ భద్రత అవసరం.