: కడివెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు.. వైసీపీ నేత రోజా తీరుపై చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘గొడవ చేస్తానని ముందే చెబితే కార్యక్రమానికి ఎవరైనా అనుమతిస్తారా?’ అని ప్రశ్నించారు. వచ్చి కార్యక్రమాన్ని రసాభాస చేస్తామంటే పోలీసులు చూస్తూ కూర్చోరని పేర్కొన్నారు. కడివెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలంటూ రోజా తీరును తప్పుబట్టారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాటల్లో ఎక్కడా తప్పులేదని, ఆయన మాటలను వక్రీకరించారని, ఇది హేయమని అన్నారు. మహిళా పార్లమెంటుకు అన్ని పార్టీల వారు వచ్చారని, అక్కడికి వచ్చిన ఓ వైసీపీ ఎంపీని కూడా తాను సన్మానించానని గుర్తు చేశారు. ప్రతి శుక్రవారం బోనెక్కి, బయటకు వచ్చి తిట్టేవాళ్లు ఉండడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేసి గెలిపించడంపై ప్రజలు పునరాలోచించాలని చంద్రబాబు కోరారు.