: మరో కుక్కపై మనసుపడ్డ ధోని!
క్రికెట్, స్పోర్ట్స్ బైకులు, కార్లతో పాటు భార్య సాక్షితో ఎప్పుడో ప్రేమలో పడిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్ళీ లవ్ లో పడ్డాడా? అంటే అవుననే అంటున్నారు, పుణే సహారా స్టేడియం భద్రత సిబ్బంది. తాజాగా మనోడు ఓ కుక్క అంటే తగని మక్కువ పెంచుకున్నాడట. నిన్న రాత్రి వారియర్స్ తో పుణేలో మ్యాచ్ సందర్భంగా స్టేడియం భద్రత తనిఖీల్లో కొన్ని జాగిలాలు కూడా పాలు పంచుకున్నాయి. వాటిలో డాబర్ మేన్, ఆల్సేషియన్, లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియం షెపర్డ్ వంటివి మొత్తం 24 వరకు ఉన్నాయి.
అయితే వీటన్నింటిలోనూ గోల్డెన్ రిట్రీవర్ అనే జాతి శునకం ధోనీ మనసు చూరగొందట. ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన పిమ్మట ట్విట్టర్లోనూ పంచుకున్నాడు ధోనీ. అన్నేసి రకాల జాగిలాలు ఒక్కచోట కొలువుదీరడం ముచ్చటేసిందని ట్వీటాడు. పైగా తనకెంతో నచ్చిన గోల్డెన్ రిట్రీవర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. అలాంటి కుక్కను తానింత వరకు చూడనేలేదన్నాడు. వీలైతే దాన్ని రాంచీ తీసుకెళతానని అంటున్నాడీ జంతు ప్రేమికుడు.
ధోనీ వద్ద ఇప్పటికే రెండు మేలుజాతి శునకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లాబ్రడార్ కాగా దాని పేరు జారా.. రెండోది ఆల్సేషియన్, దాని పేరు శామ్. ఇక భారత క్రికెట్ మొదటి మహిళ సాక్షి కూడా తనవంతుగా రెండు కుక్కలను పెంచుతోందట. ఎంతైనా భర్తకు తగిన భార్య కదా! వాటికి తోడు ఓ వీధి కుక్కను కూడా ఇటీవలే తన ఇంట్లోకి ఆహ్వానించింది సాక్షి. అంతేగాదు, ఆ శునకానికి సుల్తాన్ అని కూడా పేరు పెట్టేసిందండోయ్.