: దేశం మీసం తిప్పేందుకు సర్వం సిద్ధం.. రేపు ఉదయం 5.28కి కౌంట్ డౌన్ స్టార్ట్
అగ్ర రాజ్యాలు కూడా సాహసించని గొప్ప ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమయింది. పీఎస్ఎల్వీ-సీ37 ద్వారా ఈ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా మన దేశానికి చెందిన కార్బోశాట్-2, ఐఎన్ఎస్-1ఏ, ఐఎన్ఎస్-2ఏ ఉపగ్రహాలతో పాటు అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, యూఏఈకి చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో నింగిలో ప్రవేశపెట్టనుంది.
రేపు తెల్లవారుజామున 5.28 గంటలకు ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. మొత్తం 28 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. బుధవారం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ-సీ37 నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకుపోనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో, ప్రపంచ దేశాలన్నీ శ్రీహరికోటలోని షార్ కేంద్రపై దృష్టిని సారించాయి. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా... ఒకేసారి 104 ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా ప్రయోగించగలదా? అని అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పరీక్ష విజయవంతమైతే, స్పేస్ టెక్నాలజీలో ఇస్రో ఖ్యాతి దిగంతాలకు వ్యాపిస్తుంది. అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్ కు సైతం సాధ్యంకాని విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇస్రో మన దేశం మీసం తిప్పాలని ప్రతి భారతీయుడు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు.