: ఇక ఏ క్షణమైనా శశికళపై సుప్రీం తీర్పు... జైలు తనకు కొత్త కాదంటున్న చిన్నమ్మ!
జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళపై సుప్రీంకోర్టు ఏ క్షణమైనా తీర్పును చెప్పవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో నేడు తీర్పు వెలువడాల్సి వున్నప్పటికీ, తాజాగా, జయలలిత పేరును తొలగించాలని కర్ణాటక పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు వెల్లడి తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ వారంలో ఏదో ఒక రోజున తీర్పు వెల్లడవుతుందని, శశికళను దోషిగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో ఆరేళ్ల పాటు ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరం కావాల్సి వుంటుందని వివరించారు. కాగా, 61 సంవత్సరాల శశికళ, నిన్న మీడియా ముందుకు వచ్చి కన్నీరు కార్చిన సంగతి తెలిసిందే. తనకు జైలు జీవితం కొత్తకాదని, ఇప్పటికే జైల్లో గడిపానని, మరోసారి ఏ జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు.