: ఇప్పుడు రాజకీయాల్లో లేనుగా... భయం లేదు, నిజమే చెబుతున్నా: దగ్గుబాటి
తానిప్పుడు రాజకీయాల్లో లేనని, కాబట్టి భయం లేకుండా తన మనసులో ఉన్న మాటలు చెబుతానని వెల్లడించిన దివంగత ఎన్టీఆర్ అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నాడు సొంత మామకు అన్యాయం జరుగుతున్న వేళ, తానెందుకు చంద్రబాబు పక్కనే నిలిచి వున్నానన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి అప్పట్లో చంద్రబాబు వెనుక ఆరేడుగురు కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేరని, అయినా, పదిహేను రోజుల వ్యవధిలో ఈనాడు దినపత్రికలో మూడు సార్లు చంద్రబాబుదే బలమంటూ రామోజీరావు సంతకంతో వ్యాసాలు వచ్చాయని, ఇది సరికాదని తాను స్వయంగా వెళ్లి ఆయనకు చెప్పి చూడగా, తననే వారించారని గుర్తు చేసుకున్నారు.
తాను కూడా రాజకీయ వ్యవస్థలో ఉండాలన్న కోరికతోనే చంద్రబాబు వెంట నిలిచానని, ఆపై నిజాన్ని అర్థం చేసుకున్నానని చెప్పారు. పక్కలో బల్లాన్ని ఎందుకు పెట్టుకుంటావని చంద్రబాబుకు కొందరు చెప్పారని, ఆపై తనను దూరం పెట్టడం మొదలైందని అన్నారు. ఇప్పుడు రాజకీయాలను పట్టించుకోవడం లేదని, పుస్తకాలు చదువుకుంటూ, పుస్తకాలు రాసుకుంటూ ఉన్నానని అన్నారు.