: అన్నయ్య అలసి ఇంటికి వస్తే... ఎందుకీ జీవితం అంటూ హితబోధ చేసే వాడిని: పవన్ కల్యాణ్
నిత్యమూ సినిమా షూటింగుల్లో భాగంగా అలసి సొలసి ఇంటికి వచ్చే తన అన్నయ్య చిరంజీవికి, తాను ఆధ్యాత్మిక బోధనలు చేసిన నాటి సంఘటనలను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. జీవితమంటే ఇది కాదని ఎన్నో రాత్రులు ఆయనకు జ్ఞానబోధ చేశానని హార్వార్డ్ వర్శిటీ విద్యార్థులతో మాట్లాడుతున్న వేళ, పవన్ వెల్లడించారు. తనకు అసలు నటనంటే ఇష్టం ఉండేది కాదని, ఓ యోగిలా మారాలన్నది తన అభిమతమని చెప్పారు. అసలు జీవితం అంటే ఏంటి? అనుబంధాలకు దూరంగా ఎలా ఉండాలి? తదితర విషయాలను చిరంజీవికి చెబుతుంటే, అన్నీ విని ఆయన చిరునవ్వు నవ్వుతూ వెళ్లి పోయేవారని చెప్పారు.
ఒక రోజు ఆయనకూ అసహనం కలిగిందని, ఏదైనా ఒకటి సాధించిన తరువాత, వినూత్నంగా ఆలోచించి మేలు కలిగే పని చేసిన తరువాత, ఇవన్నీ చెప్పాలని తనకు క్లాస్ పీకారని చెప్పారు. ఆయన మాటలతో తనకూ ఆలోచన వచ్చి, వెనక్కి తిరిగి చూసుకుంటే, తాను ఏం కోల్పోయానో, ఏం చేయాలో ఓ అవగాహన వచ్చిందని అన్నారు. చదువును కోల్పోయాను, ఎటూ కాకుండా పోతానన్న ఆలోచన నటన వైపుకు దృష్టిని మళ్లించిందని అన్నారు. తనకు సిగ్గెక్కువని, షూటింగ్ కు కూడా నేరుగా వెళ్లకుండా దాక్కొని దాక్కొని వెళ్లేవాడినని, ఇతర నటులను చూస్తే సిగ్గనిపించేదని చెప్పారు.