: తమిళనాడు మంత్రి పాండ్యరాజన్ ప్రకటనతో గందరగోళానికి తెర!
సీఎం కుర్చీ కోసం శశికళ, పన్నీర్ సెల్వం ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు జారిపోకుండా శశికళ ప్రయత్నిస్తుండగా, తన బలం పెంచుకునేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమకు మద్దతు ఇచ్చిన నేతలు ఎవరితో భేటీ అయినా రెండు వర్గాల వారు అనుమానించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది. పన్నీర్ సెల్వంకు మంత్రి పాండ్యరాజన్ నిన్న తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ రోజు ఉదయం నటరాజన్ ను ఆయన కలిశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో, పాండ్య రాజన్ ప్లేట్ ఫిరాయించారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో పాండ్య రాజన్ స్పందిస్తూ, తాను కలిసింది శశికళ భర్త నటరాజన్ ను కాదని, మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్. నటరాజన్ ని అని స్పష్టం చేశారు. దీంతో, పన్నీర్ సెల్వం వర్గాల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.