: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం!
దక్షిణ ఫిలిప్పీన్స్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా నలుగురు మృతి చెందగా, వంద మంది గాయపడ్డారు. నిన్న సాయంత్రం భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయిందని, సుమారు వందసార్లు భూ ప్రకంపనలు సంభవించాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రొవిన్సియల్ కేపిటల్ సురిగవోకు నైరుతి దిక్కున భూకంప కేంద్రాన్ని గుర్తించామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ సంఘటనతో భవనాల్లో నివసిస్తున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. స్థానిక పార్కుల్లో వారు తలదాచుకున్నారు. అయితే, సునామీ భయం లేదని యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది. పలు భవంతులు కూలిపోగా, సురిగవో ఎయిర్ పోర్టులో రన్ వే దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు.