: తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న కుట్ర జరుగుతోంది: సురవరం
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ భారతీయ జనతా పార్టీపై ఆరోపణలు గుప్పించారు. అన్నాడీఎంకే పార్టీని బీజేపీ చీల్చాలని చూస్తోందని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ... ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ యోచిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికీ అవకాశం కల్పించకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై సురవరం స్పందిస్తూ... రాష్ట్రానికి హోదా రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. హోదా అంశం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సురవరం అన్నారు.