: శశికళకు మద్దతు విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో విభేదాలు!
తమిళనాడులో సీఎం కుర్చీ కోసం అన్నాడీఎంకే నేతల మధ్య జరుగుతున్న పోరు ప్రభావం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై పడింది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసర్ మాటను ఆ పార్టీ ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. శశికళకు మద్దతు ప్రకటించడాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 8 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు ఆయన తీసుకున్న నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్న తరుణంలో అన్నాడీఎంకేలోని ఓ పక్షానికి మద్దతు ఇస్తామని ఎలా అంటారు? అని ఆ ఎమ్మెల్యేల ప్రశ్న.
అంతేకాకుండా, తమిళ ప్రజల మద్దతు పన్నీర్ సెల్వంకే ఉందని, ఇటువంటి సమయంలో శశికళకు మద్దతు పలకడం సబబు కాదని వారి వాదన. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు తిరునవుక్కరసర్ ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఒకరు తెలిపారు. కాగా, 1987లో నాటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ చనిపోయిన సమయంలో కూడా తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పుడు, అన్నాడీఎంకేలో ఉన్న తిరునవుక్కరసర్, జయలలితకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో అన్నాడీఎంకే నుంచి ఆయన బయటకు వచ్చేశారు.