: దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం నిజమే!: హోదా దీక్షలో చలసాని
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ప్రత్యేక హోదా కోసం దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ... హోదా కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని, రక్తదానం కూడా చేశామని, ఎన్ని నిరసనలు తెలిపినా లాభం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏపీకి కొత్తగా వచ్చేది ఏమీ లేదని ఆయన అన్నారు. విభజన హామీలన్నీ నెరవేర్చుతూనే హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాదిపై ఉత్తరభారతీయుల ఆధిపత్యం నిజమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కడుపు రగిలిపోతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా కోసం ప్రయత్నాలు జరపడం లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి తమ ప్రాణాలు ఆర్పించయినా సరే హోదా సాధిస్తామని చెప్పారు.