: షిర్టీ సాయినాథుడి పట్ల ఇటాలియన్ మహిళ అపార భక్తి భావం... బంగారు కిరీటం విరాళం
షిర్టీ సాయిబాబా పట్ల ఓ ఇటాలియన్ మహిళ అమితమైన భక్తిని చాటుకున్నారు. 72 ఏళ్ల సెలిని డొలోరాస్ అలియాస్ సాయి దుర్గా గురువారం సాయినాథుడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బంగారు కిరీటాన్ని బాబాకు విరాళంగా అందించారు. దీని బరువు 855 గ్రాములు ఉండగా, రత్నాలు పొదిగి ఉన్నాయి. దీని విలువ సుమారు రూ.28 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.
సెలిని డొలోరాస్ గత తొమ్మిదేళ్లుగా సాయిబాబాను ఆరాధిస్తున్నారు. ప్రతి నెలా ఆమె సాయిబాబాను దర్శించుకుంటారని షిర్టీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీ సచిన్ తాంబే తెలిపారు. ఆమె గతంలోనూ బంగారంతో రూపొందించిన రెండు రుద్రాక్ష మాలలను విరాళంగా అందించినట్టు తాంబే చెప్పారు. ఇటలీలో అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నిర్మించాలన్న తలంపుతో ఉన్నట్టు ఆమె చెప్పడం విశేషం. ప్రతిపాదిత ఆలయ నిర్మాణ డిజైన్ ను ఆమె సాయిబాబా మందిరం వద్ద ఉంచి ఆశీర్వచనాలు అందుకున్నారు.