: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే... ఆంధ్ర ప్రజలకు అండగా ఉంటాం: ఎంపీ కవిత
రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలుగు ప్రజలు అందరూ కలిసే ఉండాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఎంపీ కవిత విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై విలేకరులు ఎంపీ కవిత అభిప్రాయాన్ని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆమె గుర్తు చేశారు. ఏపీకి తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.