: శశికళ ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలన్న పిటిషన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఏంకే ప్రధాన కార్యదర్శి శశికళా నటరాజన్ ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై తక్షణం విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు నిరాకరించింది. చెన్నైకి చెందిన సెంతిల్ కుమార్ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా న్యాయవాది జీఎస్ మణి వాదనలు వినిపించారు.
శశికళ తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయడం రాజ్యంగ విరుద్ధం అవుతుందని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నిందితురాలుగా ఉన్నందున, ఆ కేసులో తీర్పు వచ్చే వరకు శశికళ సీఎంగా ప్రమాణం చేయకుండా నిరోధించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ ముందు వాదనలు వినిపించారు. ఒకవేళ ఆమెను నిందితురాలిగా ప్రకటిస్తే రాజీనామా చేయాల్సి వస్తుందని, దీంతో సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయని, అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై జస్టిస్ ఖేహార్ ధర్మాసనంలోని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూద్ లతో సంప్రదించిన మీదట తక్షణం విచారణ జరిపేందుకు నిరాకరించారు.