: క్యాంపులో ఒక్కో ఎమ్మెల్యేకు కాపలాగా ఇద్దరు శశికళ అనుచరులు.. టీవీ కార్యక్రమాలు, న్యూస్ పేపర్ బంద్


అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ క్యాంపు రాజకీయాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియా కంట పడకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు తనకు చెందిన ఇద్దరు అనుచరులను బాడీగార్డులుగా నియమించారు శశికళ. బాడీగార్డుల కళ్లుగప్పి ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితిని కల్పించారు. గోల్డెన్ బే రిసార్ట్ లో శశి వర్గ ఎమ్మెల్యేలంతా ఉన్నారు. వీరిపై గట్టి నిఘా ఉంది. ఎమ్మెల్యేల వద్ద నుంచి ఫోన్లను తీసేసుకున్నారు. ఒకవేళ ఎవరివద్ద అయినా రహస్యంగా ఫోన్ ఉన్నప్పటికీ... అవి పని చేయకుండా జామర్లను ఏర్పాటు చేశారు. రిసార్ట్స్ వద్ద వందల సంఖ్యలో శశికళ అనుచరులు కాపలాగా ఉన్నారు. రోజూ ఉండే సెక్యూరిటీని అక్కడ నుంచి పంపించేసి... ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

 చదవడానికి వార్తాపత్రికలు, చూడ్డానికి టీవీ కూడా లేకుండా చేశారు. బయట జరుగుతున్న పరిణామాలు ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండా శశి వర్గం జాగ్రత్త పడుతోంది. మరోవైపు, తమ ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచడాన్ని శశికళ వర్గం పూర్తిగా సమర్థించుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కొనడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోందని... అందుకే వారిని క్యాంపుల్లో ఉంచామని చెబుతోంది.

  • Loading...

More Telugu News