: మద్దతు ఇవ్వాలని కోరిన శశికళ వర్గం... ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన కాంగ్రెస్
జయలలిత మరణం తర్వాత ఒక పక్కా ప్రణాళికతో పావులు కదుపుతూ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను చేపట్టిన శశికళ... ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేశారు. అప్పట్నుంచి ఆమెకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆమె వైపు ఉన్న ఎమ్మెల్యేలలో కొంత మంది పన్నీర్ సెల్వం శిబిరంలో చేరిపోయారు. దీనికి తోడు, ఆమెకు మద్దతు ప్రకటించడానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. ఇదే సమయంలో, పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించడానికి కొన్ని పార్టీలు ముందుకు వస్తుండటం ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఈ క్రమంలో, శశికళకు తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేత తిరవనకరసు ప్రకటించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. శశికళకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తమ మిత్రపక్షమైన డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేసింది. తమకు మద్దతు ఇవ్వాలని శశికళ వర్గం కోరినా... కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.