: నా భార్య కనిపించడం లేదు... చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే భర్త!
"సార్... ఎమ్మెల్యే అయిన నా భార్య మిస్సింగ్. ఎక్కడున్నా వెంటనే వెతికి పెట్టండి. ప్లీజ్" అంటూ ఓ మహిళా ఎమ్మెల్యే భర్త చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది పోలీసులకు ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు. కానీ, దాదాపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల జీవిత భాగస్వాములందరి పరిస్థితి ఇదే. తమ వాళ్లను ఏ క్యాంపులో పెట్టారో? ఎక్కడ ఉంచారో? వారు ఎలా ఉన్నారో? కనీసం ఫోన్ చేసి, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తమ వారు... సమయానికి కనీసం మందులైనా వేసుకుంటున్నారో? లేదో? అనే ఆవేదన.
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేలను మూడు ఏసీ బస్సుల్లో తరలించారు. ఆ తర్వాత వారి మంచి చెడ్డల నుంచి సమాచారమే లేదు. అయితే, క్యాంపుల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారని... మసాజ్ లు, వాటర్ స్కీయింగ్ లాంటి కార్యక్రమాలతో హాయిగా ఉన్నారనే వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి. వారి నుంచి కనీసం ఫోన్ కూడా లేకపోతే... దేన్ని నమ్మాలి? ఎలా ఉన్నారనుకోవాలి? ప్రతి ఎమ్మెల్యే కుటుంబీకులు అనుభవిస్తున్న ఆవేదన ఇది.
అయితే, కొంత మంది ఎమ్మెల్యేలు శశి క్యాంపుల నుంచి తప్పించుకున్నారని... వారంతా పన్నీర్ కు మద్దతు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరంతా పన్నీర్ తో టచ్ లో ఉన్నారని చెబుతున్నా... వారు మాత్రం ఇంతవరకు బయట ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో, తన భార్య గురించి ఆమె భర్త చేసిన ఫిర్యాదు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శశికళ కుట్ర రాజకీయాలకు ఇది అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.