: తమిళనాడులో ఇక మిగిలింది గవర్నర్ నిర్ణయమే... ఉత్కంఠకు ఎలా తెర పడుతుంది?
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠ పరిస్థితులు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు... పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్‌లతో వేర్వేరుగా చర్చించిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన అంశం గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవడమే. పన్నీర్ సెల్వం బలనిరూపణకు సిద్ధమని గవర్నర్‌కు చెప్పగా, శశికళ కూడా అవసరమైతే బలనిరూపణ చేసుకోవచ్చని ప్రకటిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. దీంతో గవర్నర్ తీసుకోనున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గవర్నర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్న అంశంపై స్పష్టత లేదు. అయితే, గవర్నర్‌తో చర్చించాక పన్నీర్ సెల్వంలో కనిపించిన సంతోషం చూస్తోంటే ఆయనకు అనుకూలంగానే గవర్నర్ నిర్ణయం ఉంటుందని పలువురు అంటుంటే, మద్దతు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోన్న శశికళకు అనుకూలంగా ఉంటుందని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెర ఎలా పడుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.