: శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యంపై ఎందుకంత గోప్యత?
జయలలిత మృతి తర్వాత మళ్లీ రంగంలోకి వచ్చిన శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం చెడిందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చిన్నమ్మ వర్గాల ద్వారా తెలుస్తోంది. జయలలితకు చికిత్స అందించిన ఆసుపత్రిలోనే ఆయన్ని కూడా చేర్చారని చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గోప్యంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన రోజే ఆయన అనారోగ్యానికి గురయ్యారట. నటరాజన్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్చారట.
ఇదిలా ఉంటే, తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదునుపెట్టాల్సిన సమయం ఇది. అయితే, ఈ విషయంలో శశికళను వెన్నంటి ఉండాల్సిన నటరాజన్ ఎక్కడా కనపడకపోవడం, ఆయన ప్రస్తావన రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆమెకు ఎవరు సలహాలు ఇస్తున్నారనే దానిపై కూడా తమిళ నాట చర్చ జరుగుతోంది. ఆసుపత్రి నుంచే నటరాజన్ చక్రం తిప్పుతున్నారా? లేక మరెవరైనా శశికళకు సలహాలిస్తున్నారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.