: ‘ఫేస్ బుక్’ ద్వారా పరిచయమైన బాలికకు మాయ మాటలు చెప్పి... అఘాయిత్యం!
‘ఫేస్ బుక్’ ద్వారా పరిచయమైన విద్యార్థినిపై ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రామమూర్తి నగర్ పోలీసులు తెలిపిన వివరాలు ... ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల ఒక బాలిక బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రగదీశ్ కపూర్ (32) అనే వ్యక్తికి ‘ఫేస్ బుక్’ ద్వారా ఆ అమ్మాయి పరిచయమైంది.
ఈ క్రమంలో మోడలింగ్ రంగంలో అవకాశాలు కల్పిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఒక రోజున ఆమెకు ఇచ్చిన పాలలో మత్తు మందు కలిపి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి, బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడే వాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని నిన్న అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ల్యాప్ టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, ‘పొస్కో’ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.