: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళను గవర్నర్ ఆహ్వానించక తప్పదా?
అన్నాడీంకే పార్టీలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రకటించే నిర్ణయంపైనే ఉంది. అయితే, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించక తప్పదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి గల కారణాలను చూస్తే... శశికళను రెండు రోజుల క్రితమే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక శశికళ తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే, మరోవైపు పన్నీర్ సెల్వం కూడా అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అందరూ తనకే మద్దతు తెలుపుతారని అంటున్నారు.
కాగా, పూర్తిస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్ద కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. దీంతో అంతమంది మద్దతు ఉన్నట్లు ప్రకటించుకుంటున్న శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ ఆహ్వానించక తప్పదనే విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఈ అంశంపై స్పందిస్తూ... మెజారిటీ సంఖ్యా బలమున్న పార్టీ నాయకుడితో సీఎంగా ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుందని చెప్పారు. అంతేగాక, పలు కారణాలను చూపిస్తూ ప్రమాణ స్వీకారాన్ని కొంత కాలం పాటు వాయిదా వేసేలా నిర్ణయం తీసుకునే అధికారం కూడా గవర్నర్ కు ఉంటుందని చెప్పారు.