: పన్నీరు ఎవరికి? కన్నీరు ఎవరికి?... గవర్నర్ ఏం చేయనున్నారు?
తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో... ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏం జరగబోతోందో? అనే విషయం అందరి మనసులను తొలచి వేస్తోంది. పన్నీర్, శశికళలకు అపాయింట్ మెంట్లు ఖరారయ్యాయి. అయితే, ఎవరూ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని... కేవలం 10 మందిని మాత్రమే మీ వెంట అనుమతిస్తామని రాజ్ భవన్ నుంచి ఇద్దరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో పన్నీర్ ఏం చేయబోతున్నారు? శశికళ ఎలా వ్యవహరించబోతున్నారు? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... శశికళ ఒత్తిడితోనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు గవర్నర్ దృష్టికి పన్నీర్ తీసుకెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజీనామాను తిరస్కరించే అవకాశాలను పరిశీలించాలని గవర్నర్ ను కోరనునున్నారు పన్నీర్. లేని పక్షంలో, బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరబోతున్నారు.
మరోవైపు, గవర్నర్ ముందు ఈరోజే తన బలాన్ని నిరూపించుకోవాలని భావించిన శశికళకు గవర్నర్ నిర్ణయం నిరాశను మిగిల్చింది. బలాన్ని ఇప్పటికిప్పుడే నిరూపించుకోవాల్సిన అవసరం లేదని... తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవచ్చని రాజ్ భవన్ నుంచి ఆదేశాలు రావడంతో... శశి వర్గం నిరాశకు గురైంది. అయితే, తన వెంట పది మంది మంత్రులను వెంటబెట్టుకుని గవర్నర్ వద్దకు వెళ్లే యోచనలో శశి ఉన్నట్టు సమాచారం.
సమావేశం సందర్భంగా, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా తన వెనుకే ఉన్నారనే విషయాన్ని గవర్నర్ దృష్టికి శశికళ తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రిని అయ్యేందుకు పన్నీర్ సెల్వం కూడా మద్దతు తెలిపిన విషయాన్ని ఆమె లేవనెత్తబోతున్నారు. ఏ మాత్రం బలం లేని పన్నీర్ ను తొలగించి, పూర్తి స్థాయిలో బలం ఉన్న తనను సీఎంగా అంగీకరించాలని శశికళ కోరబోతున్నట్టు సమాచారం. మరి, గవర్నర్ విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పన్నీరు ఎవరికి? కన్నీరు ఎవరికి? అనే విషయం తేలాలంటే మరి కొన్ని గంటలపాటు వెయిట్ చేయాలి.