: తమిళనాడు గవర్నర్ ముందు ప్రస్తుతం ఉన్న మార్గాలు ఇవిగో..!
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో శశికళ నటరాజన్, పన్నీర్ సెల్వం మధ్య పోరు నడుస్తోన్న నేపథ్యంలో వారిద్దరిలో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ ముందు ఉన్న పలు మార్గాలను పరిశీలిస్తే.. ఆయన శశికళను కొన్ని రోజులు ఆగమని చెప్పవచ్చు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన రూ. 66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా శశికళ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ తీర్పు రానుంది. అప్పటివరకు ఆమెను వేచివుండమని గవర్నర్ చెప్పే అవకాశం ఉంది. ఆయన ముందున్న మరో ఆఫ్షన్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకడం. పార్టీలోని ఎమ్మెల్యేలలో అధిక శాతం మంది తనవైపే ఉన్నారని అంటున్న శశికళను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆయన మొదట ఆహ్వానించి, అనంతరం అసెంబ్లీలో బలం నిరూపించుకోమని చెప్పవచ్చు.
గవర్నర్ దగ్గర ఉన్న మరో ఆఫ్షన్‌ను పరిశీలిస్తే... ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రటించిన నేపథ్యంలో ఆయనతోనే ప్రభుత్వ ఏర్పాటు చేయించే అవకాశముంది. అనంతరం ఆయన బలనిరూపణ చేసుకోవాలని చెప్పవచ్చు. ఇక గవర్నర్ వద్ద ఉన్న చివరి మార్గం, తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోసం సిఫార్సు చేయడం. అన్నాడీఎంకే పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయించే అవకాశం లేకపోయినట్లయితే ఆయన చివరగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.