: గ్రామ పరిస్థితులు చూసి చలించి పోయింది.. పాకెట్ మనీతో ఎన్నికల్లో పోటీకి దిగింది!


ఈ కాలం యువ‌తి అంటే కాలేజీకి వెళ్లి రావ‌డం.. సినిమాలు షికార్లకి వెళ్లి హాయిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయడమే గుర్తుకొస్తుంది. లేదంటే చ‌దువు ముగించుకొని చ‌క్క‌గా ఇంటిప‌ని చేస్తూ, ఉన్న‌తమైన ఉద్యోగం లేదా త‌న‌ పెళ్లివేడుక కోసం ఎదురు చూసేవారే గుర్తుకొస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్‌లో డిగ్రీ విద్యార్థిని అయిన‌  21 ఏళ్ల ఓ యువతి వంద‌న శ‌ర్మ‌ మాత్రం అంద‌రికీ భిన్నంగా నిలుస్తూ స్ఫూర్తినిస్తోంది. త‌న వ‌ద్ద డ‌బ్బు, పార్టీ నేత‌ల అండ‌దండ‌లు లేవ‌ని నిరుత్సాహ ప‌డ‌కుండా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలోకి దిగింది. తన త‌ల్లిదండ్రులు ఖ‌ర్చుచేసుకోమ‌ని ఇచ్చిన పాకెట్ మ‌నీ రూ.10 వేలు తీసుకొచ్చి డిపాజిట్‌గా సమర్పించి ఫాతేపూర్ సిక్రి నియోజక వర్గం నుంచి నామినేషన్ వేసింది.

తనకున్న ఆస్తుల మొత్తం విలువ‌ రూ.32 వేలుగా అఫిడవిట్‌లో పేర్కొంది. త‌ల్లిదండ్రులు ఆమె పోటీచేయ‌డానికి ఒప్పుకోక‌పోయినా త‌న‌ గ్రామ దుస్థితిని చూసి చ‌లించిపోయిన వంద‌న... త‌న ఊరికి ఏదో ఒకటి చేయాలని న‌డుం బిగించింది. త‌న త‌ల్లిదండ్రులు పెళ్లి చేసుకోమ‌ని చెబుతున్నప్ప‌టికీ, తాను ఎమ్మెల్యేగా ఎన్నికై ఊరిని బాగుచేసుకుంటాన‌ని చెప్పింది. ఆమెకు తన సోదరుడి సాయం ల‌భించింది.త‌మ‌ జిల్లా ప్రధాన కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామం నాగ్లా బ్రాహ్మన్ ఉంద‌ని చెప్పిన వంద‌న‌.. ఆ గ్రామంలో కనీస సదుపాయాలు కూడా లేవని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

 చదువుకోవాలంటే ఊరు విడిచి వెళ్లాల్సి వస్తోందనీ... ఇప్పటికీ ఆడపిల్లలు బయటికెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందేనని వందన పేర్కొంది. కనీసం వైద్యం, విద్య స‌దుపాయాలు అంద‌ట్లేవ‌ని, ఇప్పటికీ ఆడపిల్లలు బయటికెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందేనని కూడా తెలిపింది. వైద్యం అంద‌క‌ పక్షవాతానికి గురైన తన సోదరుడొకరు 18 ఏళ్లుగా మాట్లాడలేకపోతున్నాడ‌ని చెప్పింది. తాను సొంత డబ్బుతో  చిన్నపాటి కరపత్రాలను ప్రింట్ చేయించుకొని ఓ స్కూటర్‌పై గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాన‌ని చెప్పింది. ఆమె ప‌ట్ల‌ ఆ నియోజ‌క ప్ర‌జ‌లు ఎంతో ప్రేమ కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News