: మా వాళ్లను పన్నీర్ కొనేస్తున్నారు... ఎమ్మెల్యేలు జారిపోతున్నారని చెప్పకనే చెప్పిన శశికళ!
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పన్నీర్ సెల్వంపై మరో సంచలన ఆరోపణ చేశారు. తన వర్గంలోని ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఉదయం పోయిస్ గార్డెన్ ముందు చేరి పన్నీర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ అభివాదం చేశారు. ఆపై ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తన వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. పన్నీర్ కు కేవలం 8 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని అన్నారు. ఆయన ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేస్తూ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు.
దీంతో తన వర్గంలోని ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరంలోకి వెళ్లిపోతున్నారని అంగీకరించకుండానే శశికళ అంగీకరించినట్లయింది. మరోవైపు శశికళ వర్గంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారన్న విషయమై స్పష్టత కొరవడింది. హోటళ్లు, రిసార్టుల్లో ఉన్నవారిలో గవర్నర్ ముందుకు వచ్చి ఎందరు మద్దతు పలుకుతారన్న విషయంలోనూ సందిగ్ధత తొలగలేదు. మరోవైపు తన వెంట 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అవకాశం ఇస్తే, బలాన్ని నిరూపించుకుంటానని పన్నీర్ చెబుతున్న సంగతి తెలిసిందే.