: కేసీఆర్ సన్నిహితుడు మైహోమ్ రామేశ్వరరావుకు కీలక పదవి?
తెలంగాణలో జూపల్లి రామేశ్వరరావు గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. మైహోమ్ రామేశ్వరరావుగా ఆయన గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అంతేకాదు, కేసీఆర్ ఎంతో విశ్వసించే చిన జీయర్ స్వామితో రామేశ్వరరావుకు అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో జీయర్ తో కలసి భద్రాచలం ఆలయానికి రామేశ్వరరావు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. భద్రాచలం పుణ్యక్షేత్రం పాలనా పగ్గాలు రామేశ్వరరావుకు అప్పగించనున్నారనే ప్రచారం ముమ్మరం అయింది.
భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ప్లాన్ రూపకల్పనపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సూచన మేరకు చినజీయ్యర్ స్వామి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భద్రాచలానికి విచ్చేశారు. ఆయనతో పాటు అదే హెలికాప్టర్ లో రామేశ్వరరావు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, దేవస్థానం పండితులు, స్తపతులతో కలిసి భద్రాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు. స్వతహాగా రామభక్తుడైన మైహోమ్ రామేశ్వరరావు ఈ సందర్భంగా తన సలహాలు, సూచనలు ఇచ్చారట.
గత నాలుగేళ్ల నుంచి భద్రాద్రి ఆలయానికి పాలకమండలి లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా కమిటీని ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో, భద్రాద్రి ఆలయ కమిటీ గురించి కేసీఆర్ ఆలోచిస్తున్నారని... ఆయన మదిలో మైహోమ్ రామేశ్వరరావు ఉన్నారని చెబుతున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సంబంధించిన విషయంలో రామేశ్వరరావు టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుందని చిన జీయర్ కూడా ప్రకటించారు. దీంతో, ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.