: జయలలిత మృతిపై విచారణ చేసుకోండి.. నేను భయపడను: శశికళ నటరాజన్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో రాజుకున్న వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్కి వ్యతిరేకంగా గళం విప్పిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ నటరాజన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మ జయలలిత మృతిపై వస్తోన్నవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఆమె మరణానికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తాను ఈ విషయంలో భయపడాల్సిన పని లేదని అమె వ్యాఖ్యానించారు.
జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో తాను ఆమెను ఓ సోదరిలా చూసుకున్నానని శశికళ నటరాజన్ తెలిపారు. తాను ఎలా చూసుకున్నానో జయలలితకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఆమెను తాను తన సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నానని చెప్పారు. తాను ఆమెను ఎలా చూసుకున్నానన్న విషయాన్ని అపోలో ఆసుపత్రి సిబ్బందిని అడిగినా చెబుతారని ఆమె చెప్పారు.