: పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన 22 మంది ఎమ్మెల్యేలు... శశికళ వర్గంలో కలకలం!
తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో పావులు కదుపుతూ వచ్చిన శశికళకు... చివరి నిమిషంలో నిరాశే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా 22 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ నాయకత్వానికి మద్దతు పలికారు. ఆయన వెంటే తాము ఉంటామని చెప్పారు. మరో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వీరు కూడా పన్నీర్ కే జైకొడతారనే అంచనాలు ఉన్నాయి. శరవేగంగా మారుతున్న పరిణామాలతో తమిళ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు పన్నీర్ కు మద్దతు ప్రకటించడంతో, శశికళ షాక్ కు గురయ్యారు. ఆమె వర్గంలో కలకలం మొదలైంది. తమ అంచనాలు తారుమారై, శశికళ సీఎం కాకపోతే, తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన వారిలో మొదలైనట్టు సమాచారం. మరోవైపు సాయంత్రంలోగా తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావుతో శశికళ, పన్నీర్ సెల్వంలు తమ వర్గాలతో కలసి భేటీ కానున్నారు. అనంతరం గవర్నర్ నుంచి కీలక ప్రకటన వెలువడనుంది.