: ఫేస్ బుక్ లో పరిచయమై కోటిన్నరకు ముంచిన యువతి!


సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన విదేశీ యువతి చెప్పిన మాయమాటలను నమ్మిన హైదరాబాద్ వ్యాపారి ఏకంగా కోటిన్నర రూపాయలు సమర్పించుకున్న తరువాత, మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిజామాబాద్ కు చెందిన సాయిప్రసాద్ హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నాడు. అతని ఫేస్ బుక్ ఖాతాకు ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా యాక్సెప్ట్ చేశాడు. కొంత కాలం పాటు మంచిగా చాటింగ్ చేసి, పరిచయం పెంచుకుని అప్పుడు ఆమె రంగంలోకి దిగింది. తాను యూఎస్, లండన్ లలో వ్యాపారం చేస్తుంటానని, కొన్ని కారణాలతో ఇండియాకు 5.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 35 వేల కోట్లు) పంపుతానని, ఇండియాలో బిజినెస్ చేసి పెడితే, సగం డబ్బిస్తానని చెప్పుకొచ్చింది.

ఆమె మాయమాటలను నమ్మేసిన సాయి, అందుకు అంగీకరించగా, డబ్బును డాలర్ల రూపంలో పార్సిల్ పంపుతున్నట్టు ఆమె చెప్పింది. రెడ్ క్రాస్ డిప్లమాటిక్ కొరియర్ సంస్థ ద్వారా పంపినట్టు చెప్పింది. కొంత మొత్తాన్ని చెల్లించి డబ్బు తీసుకుని, అందులో ఆ ఖర్చును మినహాయించుకోవాలని కోరింది. కట్ చేస్తే, ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి... అంటూ సాయిప్రసాద్ కు ఫోన్ వచ్చింది. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందని చెబుతూ, స్వయంగా వచ్చి పత్రాలు చూపి దాన్ని తీసుకు వెళ్లాలని వారు చెప్పారు. తన వద్ద పత్రాలు లేవని సాయిప్రసాద్ సమాధానం ఇవ్వగా, తామే తయారు చేస్తామంటూ చెప్పి, పలు దఫాలుగా డబ్బు తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతులంటూ, కస్టమ్స్ క్లియరెన్స్ అంటూ, డబ్బు దండుకున్నారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి తనను కలిసిన నైజీరియన్లకు రూ. 16 లక్షలు ఇచ్చాడు. మొత్తం రూ. 1.5 కోట్లను వారికి సమర్పించుకున్న తరువాత మోసపోయినట్టు గమనించి పోలీసులను ఆశ్రయించాడు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని, ముఠా సభ్యుడే సాయికి విదేశీ యువతిగా పరిచయమై ఉండవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News