: ఆంధ్రకు రాజధానిగా అమరావతిని ప్రకటించడం శుభపరిణామం: గన్నవరంలో దలైలామా
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలో బౌద్ధమత గురువు దలైలామా పర్యటన ప్రారంభమైంది. కాసేపటి క్రితం ఆయన గన్నవరం విమానాశ్రయంలో కాలుపెట్టారు. ఆయనకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ... భారతీయులు తన సోదరులని అన్నారు. దేశాల్లో శాంతి నెలకొంటే ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ప్రకటించడం శుభపరిణామమని, అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అమరావతిలో బౌద్ధ స్తూపానికి సంబంధించిన వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన రాతిపేటికలకు దలైలామా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 12 మంది బౌద్ధ గురువులు పాల్గొంటారు.