: క్లయిమాక్స్ కు తమిళనాడు ఆధిపత్య పోరు... చెన్నై బయలుదేరిన గవర్నర్
తమిళనాడులో శశికళ సీఎం కావాలని కోరుకుంటున్నది ఎందరు? పన్నీర్ సెల్వం వెంట ఎంతమంది ఉన్నారు? అందరూ అనుకుంటున్నట్టు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతున్నట్టు పన్నీర్ మరోసారి సీఎం బాధ్యతలు చేపడతారా? లేక అమ్మ నెచ్చెలిగా ఉన్న శశికళ, రాష్ట్రానికి మూడో మహిళా ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం నేటి సాయంత్రానికి వెల్లడి కావచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న తమిళ రాజకీయాలు ముగింపు దశకు చేరాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు, ముంబై నుంచి చెన్నైకి బయలుదేరారు. ఇప్పటికే విద్యాసాగర్ ను అటు శశికళ, ఇటు పన్నీర్ సెల్వంలు అపాయింట్ మెంట్ కోరిన సంగతి తెలిసిందే. వీరిలో ఎవరిని ముందుగా కలుస్తారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. విద్యాసాగర్ చెన్నైకి చేరిన వెంటనే, రాజ్ భవన్ కు వెళ్లి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో పాటు మరికొందరు ఉన్నతోద్యోగులను కలుస్తారని తెలుస్తోంది. ఆపై సీఎం పదవిని కోరుకుంటున్న శశికళ, పన్నీర్ లను పిలిపించవచ్చని సమాచారం. ఎవరికి ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందో తెలుసుకుని, నిబంధనలకు అనుగుణంగా వారికి చాన్సిచ్చి బల నిరూపణ చేసుకోవాలని కొంత గడువును ఆయన విధిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.