: పన్నీర్ తిరుగుబాటు వెనక అంతుబట్టని వ్యూహం.. అంత ధైర్యం ఎలా వచ్చిందోనని సర్వత్ర చర్చ


అప్పజెప్పిన పనిని తలవంచుకుని చేయడమే తప్ప ఎదిరించి మాట్లాడరని పేరున్న పన్నీర్ సెల్వంలో ఒక్కసారిగా తిరుగుబాటు ధోరణి ఎలా వచ్చింది? ఆ తెగువకు కారణమేంటి? రాజకీయ పరిశోధకులను ఇప్పుడు తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. తమిళ ప్రజలు కూడా ఇప్పుడీ విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే ఆయన ధైర్యం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ‘అమ్మ’చాటు బిడ్డగా ఎదిగిన వ్యక్తి తిరగబడ్డారంటే ఆయన వెనక ఎదో బలమైన శక్తి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా శశకళకు సంబంధించిన రహస్యాలు పూర్తిగా తెలిసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఆమె క్షమాపణలు కోరుతూ జయలలితకు రాసిన లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టారు. అంటే ఇటువంటి ఆయుధాలు ఆయన వద్ద మరిన్ని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. వాటితో ‘చిన్నమ్మ’కు ఊపిరి ఆడకుండా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్‌‌తో పన్నీర్‌కు మంచి స్నేహబంధం ఉంది. దీనిని ఇప్పుడాయన వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు శశికళను, అన్నాడీఎంకేను దెబ్బకొట్టేందుకు ఇదే మంచి తరుణమని స్టాలిన్ భావిస్తున్నారు. దీనిని తనకు అవకాశంగా మార్చుకోవాలనేది పన్నీర్ వ్యూహం. అంతేకాదు కేంద్రంతోనూ సఖ్యతగా ఉంటూ శశికళకు చెక్ పెట్టాలని పన్నీర్ భావిస్తున్నారు. ఇక శశికళకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న మేనకోడలు దీపా జయకుమార్‌ మద్దతు దొరకడం తనకు అదనపు బలమని పన్నీర్ విశ్వసిస్తున్నారు. వీటిన్నింటి కంటే ప్రజల్లో తనపై పెరిగిన సానుభూతి కొండంత బలమని సెల్వం నమ్ముతున్నారు. ఈ కారణంగానే శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి అమీతుమీకి సిద్ధమైనట్టు పరిశీలకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News